రెడ్ క్రాస్ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం హర్షణీయం-మంత్రి కాకాణి

నెల్లూరు: జిల్లాలో రెడ్ క్రాస్ సేవా సంస్థ వివిధ రకాల వైద్య సేవలు అందిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.ఆదివారం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో మొబైల్ వ్యాక్సినేషన్, మొబైల్ రక్తదాన వాహనాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సేవా సంస్థ అనేక రకాల వైద్య సేవలు అందిస్తు దేశంలోనే గుర్తింపు తెచ్చుకోవటం జిల్లాకే గర్వకారణమన్నారు.ఒక కోటి 12 లక్షల ఖరీదు చేసే అధునాతన వసతులతో కూడిన మొబైల్ వాహనాలు నెల్లూరు జిల్లాకు కేటాయించడం వారి పనితనానికి నిదర్శనమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రక్తపు నిల్వలు కొరవడిన సందర్భాలలో రక్తదాతల చెంతకే వాహనంను తీసుకెళ్లి రక్తం సేకరించే సౌకర్యం కలిగిందన్నారు.అదేవిధంగా వివిధ రకాల వ్యాక్సినేషన్ లను ప్రజలకు అందించటానికి వారి చెంతకే వాహనం వెళుతుందన్నారు. కష్టపడి పనిచేసి సమర్థవంతంగా సేవలు అందించడం వల్లనే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వాహనాలు జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు కేంద్రం కేటాయించటం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.రెడ్ క్రాస్ సంస్థ వారిచే ఉచిత కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు మంత్రి కాకాణి అందించారు. వారితో ముచ్చటిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా జీవించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.