అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయండి- కమిషనర్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో ఓటర్లు-జనాభా నిష్పత్తిలో 50 వేల ఓటర్ల తేడా ఉందని, స్పెషల్ కాంపెయిన్ ప్రోగ్రాం ద్వారా దానిని త్వరితగతిన సరి చేయనున్నామని తెలిపారు. జనాభాకు తగ్గట్టుగా ఓటర్లు నమోదుకై ప్రజలను చైతన్యపరిచి 18 సంవత్సరాలు దాటిన అర్హులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు కృషి చేయాలని సచివాలయ కార్యదర్శులను కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న 6,7, 8 క్లైయిమ్ ఫారాలను నిర్ణీత గడువులోగా సచివాలయ కార్యదర్శులు పరిష్కరించాలని, బూత్ స్థాయి అధికారుల సేవలను అన్ని విధాల వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితా 2024 సంవత్సరం డిసెంబర్ వరకు ప్రధాన ఓటర్ల జాబితాగా ఉంటుందని, పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. జనాభాకు తగ్గట్టుగా ఓటర్లను నమోదు చేసేందుకు ఇంటింటి సర్వే డేటా వివరాలు ఆధారంగా క్లెయిమ్ 6 ఫారం లను పెద్ద ఎత్తున సేకరించాలని సచివాలయ సెక్రటరీలను ఆదేశించారు. ప్రతిఒక్క బి.ఎల్.ఓ 200 మంది నూతన ఓటర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు.