రొట్టెల పండుగను జిల్లాకే తలమానికంగా నిర్వహిద్దాం-మంత్రి గోవర్ధన్ రెడ్డి

ఆగస్టు 9 నుంచి 13 వరకు..
నెల్లూరు: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ-2022ను ఆగస్టు నెల 9వ తేదీ నుంచి 13 వరకు అన్ని ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో సమన్వయం చేసుకుంటూ జిల్లాకే తలమానికంగా నిర్వహిద్దామని వ్యవసాయ శాఖామంత్రి కాకాణి అన్నారు..నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సమీక్షా సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రొట్టెల పండుగ నిర్వహించలేదని, ఈ ఏడాది గతానికన్నా రెట్టింపు సంఖ్యలో భక్తులు, యాత్రికులు దర్గాను సందర్శించే అవకాశముందని తెలిపారు. గతంలో పండుగను నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులు ప్రస్తుతం బదిలీల్లో ఉన్నప్పటికీ, తాత్కాలికంగా వారి సేవలను వినియోగించుకునేలా సంబంధిత జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నామని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు..కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ స్వర్ణాల చెరువు పరిశుభ్రత కోసం జిల్లా ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగాలను, రెవెన్యూ, ఐ & పి.ఆర్ విభాగలను సమన్వయం చేస్తామన్నారు..దర్గా కమిటీ సభ్యులు జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ వి.ఐ.పి ల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, ఎస్పీ విజయ్ రావు, కమిషనర్ జాహ్నవి, జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.