సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం వైభవం

నెల్లూరు: నగరంలోని ఎ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం ఉదయం నిర్వహించిన పుష్పయాగానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు..సుగంధాల్ని వెదజల్లే రంగు రంగుల పుష్పాలు, పత్రాలతో ఈ పుష్పారాధన వేడుకగా జరిగింది. పుష్పార్చన జరుగుతుండగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి దివ్యమనోహర రూపాన్ని వర్ణించడానికి మాటల్లో సాధ్యం కాదు.. శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
వేడుకగా పుష్పయాగం:-ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో కానీ అర్చక పరిచారకులు,అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
ఇందులో భాగంగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు.ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు.
ఉదయం 8.15 గంటలకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం రెండు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు.ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.ఈ సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. చివరగా నక్షత్ర హారతి ఇచ్చారు..అనంతరం టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు సన్మానించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా ఎస్పీ విజయ రావు,అదనపు ఎస్పి శ్రీమతి హిమవతి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఇతర అధికారులు,విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.