పొరపాట్లు లేకుండా పరిశీలించి ఓటర్ల జాబితాను తయారుచేయాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ చక్రధర్ బాబు, E.R.Oలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, పట్టభద్రుల,ఉపాధ్యాయుల నియోజక వర్గం ఓటర్ జాబితా తయారీ, ఓటుకు ఆధార్ అనుసంధానం తదితర అంశాలపై కలెక్టర్ E.R.Oలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుగా తొలగించేందుకు జాబితాను పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తరువాత తొలగించాలని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ధారణ చేయకుండా తొలగించరాదని ఆయన ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల నమోదు, తొలగింపు కోసం అందిన దరఖాస్తులను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించి, తుది జాబితాను 2023 జనవరి, 5వ తేదీన ప్రకటించాలని కలెక్టర్, E.R.Oలను ఆదేశించారు. ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పు లకు సంబంధించిన దరఖాస్తులను B.L.O దగ్గర ప్రజలకు అందుబాటులో వుండేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన వారిని ఓటర్ గా చేర్పించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించడం జరగాలన్నారు.
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గం ఓటర్ నమోదు కింద అందిన క్లైయిమ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారుచేయాలని కలెక్టర్, E.R.Oలను ఆదేశించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గం ఓటర్లకు సంబందించి ఈ నెల 23వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించాల్సివుందని, అలాగే 2022 డిసెంబర్ 30న తుది జాబితాను ప్రకటించాల్సి వుందని, ఈలోగా నిర్ధేశించిన గడువులో క్లైయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఓటుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ 54.89 శాతం పూర్తి అయిందని, సంబంధిత E.R.Oలు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఓటుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.