నూతన సంవత్సరం సందర్బంగా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలి-కలెక్టర్

రహదారి భద్రత చర్యలు..
నెల్లూరు: జిల్లాలో రహదారి భద్రత చర్యలు కట్టుదిట్టంగా చేపట్టి, ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు జాతీయ రహదారుల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు.కావలి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల నుంచి ఇంకా నివేదికలు అందలేదని వెంటనే ప్రమాదం జరిగే ప్రాంతాలు పరిశీలించి సూచిక బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కందుకూరు మోచర్ల రహదారి ప్రమాదంలో ఐదు మంది మృతి చెందారని బాధ్యులైన వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో 74 ప్రమాదాలు,,94 మరణాలు తగ్గాయని రహదారి భద్రత నియమాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేసి వాటిని మరింతగా తగ్గించాలన్నారు. ఈ సంవత్సరం జరిగిన 340 మరణాల కేసులలో 10 ప్రధానమైన కేసులను తీసుకొని వాటిని క్షుణ్ణంగా విశ్లేషించాలని మరణాలు తగ్గించడానికి కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకొని రావాలన్నారు.బుజి బుజి నెల్లూరు, గొలగమూడి వద్ద జాతీయ రహదారిలో పైవంతెనలు నిర్మాణాన్ని వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలు సూచిక బోర్డులపై సరైన అవగాహన కలిగించాలన్నారు.
జాతీయ రహదారులు ఆరువరుసల రహదారుల్లో ప్రతి 15 కిలోమీటర్ల జంక్షన్లో సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మకూరు బస్టాండ్ పై వంతెన నుండి సాయిబాబా దేవాలయం మార్గంలో ప్రమాదాలకు కారణమవుతున్నఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలలో ఈనెల 31వ తేదీ రాత్రి నుంచి నిర్ణీత వేళల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మనుబోలు జాతీయ రహదారి-16 మార్గంలో కల్వర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రమాదాలు నివారించాలన్నారు. నగరంతో సహా అన్ని మున్సిపాలిటీలలో రద్దీ నివారణకు సిగ్నల్ పాయింట్లను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.ప్రతి మంగళవారం రహదారి భద్రతపై బాగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అవి నిరంతరం కొనసాగాలని సూచించారు.