హైదరాబాద్: హిరోయిన్ సమంత తన ఆరోగ్యంపై స్పందిస్తూ, ట్వీట్టర్ వేదికగా అందరికీ సమాధానమిచ్చారు. తాజాగా ఆమె నటించిన ‘యశోద’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానున్న నేపథ్యంలో సమంత డబ్బింగ్ చెబుతున్న ఫొటోతోపాటు ఓ లేఖ రాశారు. సదరు ఫోటోలో సమంత చేతికి సెలైన్ ఉంది.ఇందులో అమె ఇలా పేర్కొన్నారు. ‘‘యశోద’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నాకు మరింత మనోబలాన్ని ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్’(Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని తెలియచేయాలి అని భావించినప్పటికి కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం స్థిరంగా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇంక ఒక్క రోజు కూడా ఇలా ఉండలేను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఐ లవ్ యూ’’ అని సమంత ట్వీట్ చేశారు.
— Samantha (@Samanthaprabhu2) October 29, 2022