ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచాలి, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టి ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం నగరంలోని ముత్తుకూరు పై వంతెన సమీపంలోని జలవనరుల శాఖ కార్యాలయం, వి ఆర్ లా కళాశాల లో ఉన్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయవలసి ఉందన్నారు. జిల్లాలో జనాభాకు తగ్గట్టుగా ఓటర్ల నిష్పత్తి (ఈపి రేషియో) లేదని, తక్కువ ఉందని, అలాగే స్త్రీ పురుష ఓటర్ల లింగ నిష్పత్తి కూడా చాలా తేడా ఉందని దీన్ని అధిగమించేందు కోసం పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ముఖ్యంగా 18-19, 20-29 సంవత్సరాల వయసు వారిని ముమ్మరంగా ఓటర్లుగా చేర్పించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం 50 క్లెయిమ్లు వచ్చేలాగా తీవ్రంగా కృషి చేయాలన్నారు. ఇందుకోసం జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ధి పొందుతున్న విద్యార్థుల వివరాలను తీసుకొని వారిలో ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి వెంటనే చేర్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ కార్డుకు తో ఆధార్ కార్డు నెంబరు అనుసంధానం కూడా నెల్లూరు లో 60 శాతం పూర్తయిందని మిగిలిన కార్డులను కూడా పూర్తిగా అనుసంధానం చేయాలని సూచించారు. బూతు స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేయాలని లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నగర కమిషనర్ శ్రీమతి డి హరిత, నెల్లూరు ఆర్డీవో మలోల తహసిల్దారులు వెంకటేశ్వర్లు, నిర్మలానంద బాబా, బిఎల్వోలు పాల్గొన్నారు.