ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి చూపిన బాట సదా ఆచరణనీయం-కలెక్టర్

నెల్లూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో భావితరాలు పయనించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి కలెక్టర్, పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, స్వాతంత్ర్య సమరయోధులుగా ఆయన దేశం కోసం చేసిన త్యాగం, చూపిన ధైర్యం, స్థైర్యం తలమానికమని, ఆనాటి సైమన్ కమిషన్ కు ఎదురు నిలబడి ముందు నన్ను కాల్చండి అంటూ తన గుండెను చూపిన ఆంధ్ర కేసరి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జరుపుకొని దేశ వ్యాప్తంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, తదితరులు పాల్గొన్నారు.