పారామెడికల్ కోర్సుల ద్వారా వైద్య రంగంలో సహాయకుల కొరత తీరుతుంది-లోక్ సభ స్పీకర్

నెల్లూరు: అంత్యోదయ మార్గంలో గ్రామీణ ప్రజలకు, యువతకు, అణగారిన వర్గాలకు స్వర్ణభారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని లోక్ సభ సభాపతి ఓం బిర్లా అన్నారు. సోమవారం హెలికాఫ్టర్ ద్వారా వెంకటాచలం లోని అక్షర విద్యాలయానికి చేరుకున్న లోక్ సభ స్పీకర్,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ – సోమ సాంకేతిక శిక్షణా సంస్థ అందిస్తున్న పలు శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సోమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ సారధి డ్రైవింగ్ పాఠశాలను ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లో అనన్య పారామెడికల్ కోర్సుల శిక్షణా కేంద్రాన్ని, అక్కడి కౌసల్యా సదన్ లో ఏర్పాటు చేసిన ప్రజ్ఞ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది కొరత ప్రస్ఫుటంగా కనిపించిందని, ఈ నేపధ్యంలో పారామెడికల్ కోర్సుల ద్వారా వైద్య రంగంలో సహాయకుల కొరత తీరగలదని ఆకాంక్షించారు.
మాజీ ఉపరాష్ట్రపతి:- ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జీవితంలో అన్నీ మనం ఊహించినట్లు జరగవని తెలిపారు. ముఖ్యంగా అధికారానికి మనం దగ్గరగా వెళ్ళే కొలదీ దూరమౌతుందని, దూరంగా జరిగే కొలదీ దగ్గరవుతుందన్నారు. జీవితంలో ఏదీ ఆశించకుండా పని చేసుకుంటూ ముందు సాగడం వల్ల ప్రశాంతంగా అనుకున్నది చేయగలిగానని, ప్రజలకు చేసిన సేవ అధికారంగా మారి, మరింత సేవ చేసే అవకాశానిచ్చిందన్నారు.