రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమస్యే లేదు-పవన్

అమరావతి: రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమస్యే లేదని,జనసేన పార్టీని అధికారం దిశగా నడిపే బాధ్యత తనకు వదిలి వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.అదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన ‘కౌలురైతు భరోసా’ యాత్రలో పవన్ పాల్గొన్నారు. 210 మంది రైతు కుటుంబాలకు రూ.లక్ష రూపాయలు సాయం అందచేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన ‘వారాహి’ని ఆపితే తానేంటో చూపిస్తానంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరన్నారు. ‘అంబటి’ కాపుల గుండెల్లో కుంపటిగా వున్నడు,,పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని,,మరలా వైసీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో తనకు వదిలేయాలని,,తనను నమ్మాలన్నారు. తాను ఎక్కడికీ పారిపోనని,,మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలోనే ఉంటానన్నారు. తప్పు చేస్తే తన చొక్కా పట్టుకుని నిలదీయొచ్చని అన్నారు.తనను వారాంతపు పొలిటీషియన్ అంటూ విమర్శలు చేస్తారని,, వారానికి ఒక రోజు వస్తేనే ఇంత గోల చేస్తున్నారు,, రోజూ ప్రజల్లో ఉంటే ఇంకెంత గోల చేస్తారంటూ వ్యాఖ్యనించారు.”మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు,,అక్రమాలు,, దోపిడీలు చేసి సంపాదించిన డబ్బులు లేవు,, వేల కోట్ల విరాళాలు రావు,, సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నా,,మీలాంటి వాళ్లు తృణమో పణమో ఇస్తే 9 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నా” అంటూ చెప్పారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని,,ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాలేమని తెలిసి,, వైసీపీ నేతలు రాష్ట్రంలో హింసకు పాల్పడే అవకాశం ఉందని,, అయినా ఎలాంటి భయం అవసరం లేదన్నారు.