తిరుమలలో గదుల కేటాయింపు వ్యవస్థ తిరుపతికి తరలింపు-ఈవో ధర్మారెడ్డి

తిరుమల: తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతిలో చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తామన్నారు. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నామన్నారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని, క్యాలెండర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో వచ్చే వారం నుండి అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
సెప్టెంబరు నెలలో నమోదైన వివరాలు :
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య-21.12 లక్షలు…హుండీ కానుకలు-రూ.122.19 కోట్లు…లడ్డూలు- 98.74 లక్షలు… అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య-44.71 లక్షలు… తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య-9.02 లక్షలు అని తెలిపారు.