అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో రెండు వికెట్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ స్కామ్ లో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల నుంచి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్న ఈడీ అధికారులు,వారిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరూ ఆంధ్ర, తెలంగాణకు చెందిన వారుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. శరత్, వినయ్ బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.