ఆరోగ్యశ్రీ పథకం కింద అసలు వైద్యంకు డబ్బు తీసుకొవడం ఏమిటి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులకు మానవత్వంతో చికిత్స అందించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఇకపై రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ చక్రధర్ బాబు సంబంధిత ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు.శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ పథకం అమలు, వైద్య సేవల తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రోగుల నుంచి 193 ఫిర్యాదులు అందాయని, అందులో 57 కేసులకు సంబంధించి వైద్య చికిత్సల కోసం తీసుకున్న నగదు తిరిగి సంబంధిత రోగులకు చెల్లించారన్నారు. ఇంకా 21 కేసులకు సంబంధించి నగదు చెల్లించాల్సి ఉందన్నారు. మరో 64 కేసులు తప్పుడు కేసులుగా నిర్ధారించడం జరిగిందని, 51 కేసులు వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అసలు వైద్యం ఉచితంగా అందించాలని అటువంటిది రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం సరైనది కాదని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 21 కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా కొత్తగా మరో 809 వైద్య సేవలు కలిశాయని వాటికి సంబంధించి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వైద్య చికిత్సల కోసం తిరుపతి, చెన్నైకు రెఫర్ చేసే ముందు సంబంధిత ఆసుపత్రులతో మాట్లాడి రోగి ఆరోగ్య పరిస్థితులను కూడా వారికి తెలియజేయాలని సూచించారు.