టిడ్కో గృహాల మంజూరు వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నాం-కమిషనర్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కారానికై రూపొందించిన స్పందన వేదికను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జాహ్నవి సూచించారు..సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన వేదికను కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నామని వివరించారు..అదేవిధంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంభందించి 23 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీ నివేశన స్థలాలు, టిడ్కో గృహాల మంజూరు వివరాలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నామని కమిషనర్ చెప్పారు..అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన వారి జాబితాలను కార్యాలయంతో పాటు సచివాలయాల్లో సైతం అందుబాటులోకి తెచ్చామని, పథకాలకు సంభందించిన వివరాలకై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.