ఫ్లెక్సీ ఆధారిత వ్యాపారులకు ప్రత్యమ్నాయం కల్పిస్తాం-కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు: ప్లాస్టిక్ ఫ్లెక్సీ వ్యాపార రంగంపై ఆధారపడిన వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి, ఆర్ధిక భద్రతకు భరోసా ఇస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫ్లెక్సీ వ్యాపారులతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా హ్యాండ్లూమ్, వస్త్రాలతో కూడిన బ్యానర్లను మెషీన్ల ద్వారా తయారుచేయాలని సూచించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఫ్లెక్సీ ఆధారిత కార్మికులను గుర్తించి ఇతర వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సహక రుణాలు అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలులోకి వస్తుందని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసారు. ప్రభుత్వ నిబంధనల అమలుకై ఎమ్.పి.డి.ఓ, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్.డి.ఓ, పోలీస్, సచివాలయ విభాగాలను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని కలెక్టర్ వెల్లడించారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ఫ్లెక్సీ ఏజెన్సీలకు నోటీసులు అందించామని, ప్రతిఒక్కరూ సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.