DISTRICTS

పొదుపు సంఘాల్లోని మహిళలు సరికొత్త ఆలోచనలతో- సీఈవో ఇంతియాజ్

నెల్లూరు: పొదుపు సంఘాల్లోని మహిళలు సరికొత్త ఆలోచనలతో వ్యాపారవేత్తలుగా రాణించాలని సెర్ఫ్ (రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో ఎండి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. బుధవారం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పొదుపు మహిళల ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో నెల్లూరు DRDA వారు పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పొదుపు మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడంతో పొదుపు మహిళలకు బ్యాంకులు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయని, ఎటువంటి షూరిటీ లేకుండా పొదుపు గ్రూపులకు 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేయమని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించడం ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీ రుణాలు కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రూపులో ఇద్దరు మహిళలు  కుటీర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి గ్రామాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సెర్ప్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, గ్యాస్ డీలర్ షిప్ లు, రోడ్డు నిర్మాణ పనులు, వివిధ రకాల పరిశ్రమల స్థాపనలో పొదుపు మహిళలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.సమాజంలో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో పొదుపు మహిళల పాత్ర అమోఘమని, పొదుపు సంఘాల ప్రస్థానంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా మహిళలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో అధికారులు,,పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *