DISTRICTS

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంకు స్థలం కేటాయింపు-మంత్రి కాకాణి

నెల్లూరు: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వెంకటాచలంలో ఏర్పాటు కావడం మన రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఉదయం వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారి పక్కన  ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రం భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన స్థల ధ్రువీకరణ పత్రాలను మైసూరు భారతీయ భాషా సంస్థ డైరెక్టర్ శైలేంద్ర మోహన్ కు మంత్రి అందించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక భవనంలో కొనసాగిన ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్ర సొంత భవన నిర్మాణానికి అడిగిన వెంటనే కోట్లాది రూపాయల విలువైన 5.5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేసిన ముఖ్యమంత్రి తెలుగు భాష పట్ల తనకున్న గౌరవాన్ని చాటారన్నారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారన్నారు.ఈ కేంద్ర భవన నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకారంతో  తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రాచీన తెలుగు భాష అధ్యయనానికి, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎప్పటికీ మరువరాదని, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *