DISTRICTS

సెప్టెంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ-కలెక్టర్

 కల్నల్ కోహ్లీ..

నెల్లూరు: నగరంలో సెప్టెంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.గురువారం నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ పై గుంటూరు రేంజ్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కోహ్లీతో కలిసి జిల్లా కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నెల్లూరు నగరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 34,338 మంది ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో జిల్లాకు చెందిన 970 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. గతంలో కంటే ఈసారి జిల్లా నుంచి 50 శాతం అదనంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో  వెనుకబడిన తరగతులకు చెందిన, పేద విద్యార్థులను గుర్తించి రెండు బ్యాచ్ లుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక నెల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణలో వీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా, రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి, ఎక్కువమంది అగ్ని వీరులు మన జిల్లా నుంచి ఎంపికయ్యేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.నగరంలో పది రోజుల పాటు జరిగే అగ్నివీర్ నియామకాలకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి హాజరవుతున్న అభ్యర్థులకు, ఆర్మీ అధికారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు.అభ్యర్థులందరూ కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మూడు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొంది రిక్రూట్మెంట్లో పాల్గొనాలని సూచించారు.

 గుంటూరు రేంజ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్:- కల్నల్ కోహ్లీ మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిందని, సెప్టెంబర్ 13 లోగా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని రిక్రూట్మెంట్ ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. దశలవారీగా జరిగే ఈ రిక్రూట్మెంట్ లో అభ్యర్థుల ఎత్తు, బరువు, ఫిట్నెస్, పుల్లప్స్ , రన్నింగ్ మొదలైన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల ఫోటో వెరిఫికేషన్, బయోమెట్రిక్ చేపట్టి ఎంపికైన అభ్యర్థుల వివరాలను న్యూఢిల్లీకి పంపనున్నట్లు చెప్పారు.జిల్లా అధికారులు అందరూ ఈ ర్యాలీ విజయవంతం చేసేందుకు ఆర్మీ అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *