బాలికల అభివృద్ధికి ప్రధాన సాధనం విద్యే-నాగసాయి సూరి

అంతర్జాతీయ బాలికా దినోత్సవ..
నెల్లూరు: బాలికల అభివృద్ధికి విద్యను మించిన మార్గం లేదని, అందుకే బాలికలు విద్యావంతులై జీవితంలో సాధికారతను సాధించి ఉన్నత స్థాయికి ఎదిగే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, నెల్లూరు – ప్రకాశం జిల్లాల క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి తెలిపారు. బేటీ బచావ్ – బేటీ పడావ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల ఉద్దేశం ఇదేనన్న ఆయన, చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్న వారికి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అండగా ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నెల్లూరులోని శ్రీ కస్తూరి దేవీ బాలికోన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కస్తూరి దేవి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ మాట్లాడుతూ, తాము కూడా చిన్న వయసులో ఇప్పటి కంటే అనేక రకాల సమస్యలను, సమాజంలో వేళ్ళూనుకున్న వివక్షలను అధిగమించటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. మనం భయపడితే సమస్యలు మనల్ని భయపెడతాయని, ఎదిరించి ఆత్మస్థైర్యంతో నిలబడితే జీవితంలో ఏదైనా సాధించగలమని తెలిపారు.