22వ తేది నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

అమరావతి: బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.అయితే అది ఎక్కడ తీరం దాటుతుంది,ఎంత తీవ్రంగా దిని ప్రభావం ఉంటుంది అన్న విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.IMD తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22న ఉదయ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫాన్‌గా మారితే, ఆంధ్రా, ఒడిశా సమీపంలో తీరం దాటితే తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ తుఫాన్ కు “సిత్రాంగ్” అనే పేరును థాయ్ ల్యాండ్ ప్రతిపాదించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సముద్ర తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. అయితే ఈ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారుతుందో లేదో అన్న అంచనా ప్రస్తుతానికి వేయలేమని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం తుపాను ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.