రాష్ట్రస్థాయి క్రీడా ఉత్సవాలు-మంత్రి కాకాణి

పోస్టర్ విడుదల..
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జగనన్న క్రీడా సంబరాల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తీకునిరావాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జగనన్న క్రీడా సంబరాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా టోర్నమెంట్ నిర్వహించి ముఖ్యమంత్రి పుట్టినరోజు డిసెంబర్ 21న ఫైనల్స్ నిర్వహించి విజేతలకు సుమారు 50 లక్షల వరకు నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. జిల్లాలోని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు), మెన్స్ క్రికెట్ క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
అనంతరం సెట్నల్ సీఈవో పుల్లయ్య జగనన్న క్రీడా సంబరాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నియోజకవర్గ, జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు), మెన్స్ క్రికెట్ పోటీలకు సంబంధించి క్రీడాకారులు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెట్నల్ సీఈవో పుల్లయ్య చెప్పారు. నవంబర్ 10 లోగా నియోజకవర్గ స్థాయిలో, 30లోగా జిల్లా, డిసెంబర్ 10లోగా జోనల్ స్థాయిలో ఆటల పోటీలను నిర్వహించి డిసెంబర్ 21న ఫైనల్స్ నిర్వహించేలా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు.ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు వయసు 17 ఏళ్ళకు పైబడి ఉండాలన్నారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు చెప్పారు.