ప్రభుత్వ ఉద్యోగులందరూ రాజ్యాంగ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి కలెక్టర్

నెల్లూరు:ప్రభుత్వ ఉద్యోగులందరూ రాజ్యాంగ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కెవియన్ చక్రధర్ బాబు సూచించారు.శనివారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తోలుత ఉద్యోగులతో భారత రాజ్యాంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య నియమాల మేరకు నడుచుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుతూ, ప్రజలoదరికీ సమాన అవకాశాలు లభించేవిధంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. ప్రజలకు సేవలందించే ప్రక్రియలో వచ్చే వివిధ రకాల సందేహాలను నివృత్తి చేసేవిధంగా రాజ్యాంగంలో పొందుపర్చారని వివరించారు. రాజ్యాంగంలోని ప్రతి అక్షరం అందరికీ శిరోధార్యమన్నారు. ఉద్యోగులందరు వ్యక్తిగత భాద్యతగా ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడేవిధంగా పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ రంగ వర ప్రసాద్, డి సి ఓ తిరుపాల్ రెడ్డి, మెప్మా పిడి రవీంద్ర, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.