పన్నుల వసూలు లక్ష్యాలను పూర్తి చేయండి-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను, కమర్షియల్ పన్నుల వసూళ్లకై రెవెన్యూశాఖకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, అంచనాలు అందుకోని వారిపై చర్యలు తప్పవని కమిషనర్ శ్రీమతి హరిత అధికారులను హెచ్చరించారు. నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ శాఖ అధికారులతో కమిషనర్ శ్రీమతి హరిత తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని, ఇప్పటికీ డిమాండ్ నోటీసులు జారీ చేయని కమర్షియల్ భవనాలను గుర్తించి వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ చేసి వివరాలను పారదర్శకంగా ఉంచాలని,,నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, డిమాండ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుధ్య నిర్వహణ పనుల యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించి కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు అధికారులంతా కృషి చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.