జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు-పవన్ కళ్యాణ్

అమరావతి: జగనన్న కాలనీల్లో ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తున్న జగనన్న కాలనీని వెళ్లి అక్కడ నిర్మాణంలో వున్న ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు…ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ పట్టించుకుందా? గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నాయకులను ప్రజలు నిలదీయాలి. జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించాలి. జగనన్న కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే ఈపాటికి ఇళ్లు పూర్తయ్యేవి కదా? 12 వేల ఇళ్లను నిర్మించలేనివాళ్లు రాజధానిని నిర్మిస్తారా? రూ.15 వేల కోట్ల వరకు డబ్బు దోచేశారు. ఈ దోపిడీ గురించి స్వయంగా మోదీకి వివరిస్తా. జనసేన అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తాం. అవినీతికి పాల్పడిన వాళ్లు జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే.చరిత్ర ఉన్న పార్టీలు కూడా జనసేనకు భయపడుతున్నాయి. వైసీపీ నేతల గూండాగిరికి భయపడం. మత్స్యకారులకు హాని కలిగించే ఏ జీవోనైనా అడ్డుకుంటాం. యువతను మరోసారి కోరుతున్నా. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి’’ అని పవన్ కల్యాణ్ కోరారు.