ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం-కమిషనర్ హరిత

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా పర్యవేక్షించి అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత పేర్కొన్నారు. స్థానిక 20వ డివిజను వనంతోపు ప్రాంతంలోని వికలాంగుల భవన్ ప్రాంగణం, 22వ డివిజను బి.వి నగర్ లోని గిరిజన భవన్ ప్రాంగణం, 29వ డివిజను గాంధీ నగర్ లోని మహిళా ప్రాంగణంలో నిర్మిస్తున్నఆరోగ్య కేంద్రాలను కమిషనర్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో సూచించిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక గొలగముడి రోడ్డు ఇస్కాన్ టెంపుల్ మార్గంలోని మిట్ట కాలువపై జరుగుతున్న సిమెంట్ కల్వర్ట్ పనులను కమిషనర్ తనిఖీ చేసారు. కల్వర్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు మార్గం ద్వారా రవాణా సాఫీగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.