AMARAVATHIHEALTH

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల తయారీ, వాటర్ క్యాన్లలో నీటి స్టోరేజ్, రవాణా ప్రక్రియల్లో కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ సూచించారు. స్థానిక కొండాయపాలెం గేటు సమీపంలో వాటర్ ప్యాకెట్లు రవాణా చేస్తున్న వాహనాలను డాక్టర్ సోమవారం తనిఖీ చేశారు.

నగరంలోని వివిధ దుకాణాలకు రవాణా చేస్తున్న వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పయిరీ తేదీలను ముద్రించకపోవడాన్ని గమనించి, వాటిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. వాటర్ ప్యాకెట్ల తయారీ సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. వాటర్ ప్యాకెట్లపై తేదీలను ముద్రించకుండా మార్కెట్ లోకి పంపిణీ చేస్తే, ఆయా వ్యాపార సంస్థలపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డాక్టర్ హెచ్చరించారు.

మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని, ప్రతియేటా క్రమంతప్పకుండా అనుమతులను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ప్లాంట్లలో క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వాటర్ ప్లాంట్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలని, విధులు నిర్వహించే సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు పొందాలని డాక్టర్ సూచించారు. వాటర్ క్యాన్లపై సంబంధిత సంస్థ స్టిక్కర్ ను తప్పనిసరిగా అంటించాలని డాక్టర్ ఆదేశించారు.

అన్ని వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్, ఎన్. ఓ.సి సెర్టిఫికెట్ అనుమతులను తప్పనిసరిగా పొందాలని , ప్రాంగణాల్లో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజా ఆరోగ్య పరిరక్షణకు నగర పాలక సంస్థ సూచించిన అన్ని నిబంధనలను అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించినట్లయితే లైసెన్సులు రద్దు చేస్తామని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *