అన్నదాతలకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్-మంత్రి పెద్దిరెడ్డి

నెల్లూరు: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం ముత్తుకూరు మండలం నేలటూరు జెన్కో థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన సీఎం బహిరంగ సభ, హెలిప్యాడ్, పైలాన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ను అందిస్తున్నామని, విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రాజెక్టుల వల్ల తక్కువ ఖర్చుతో మనకు అవసరమైన విద్యుత్ ను మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. నేడు జెన్కో మూడో యూనిట్, ఫిబ్రవరిలో విజయవాడ వద్ద గల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో ఏడో యూనిట్ కూడా సీ.ఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని,ఈ రెండు యూనిట్ల ఏర్పాటుతో రాష్ట్రంలో విద్యుత్ కొరత పూర్తిగా తగ్గి, ప్రజలకు నిరంతరాయం విద్యుత్తు అందించే వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.