నవంబర్ నుంచి నగరంలో ఫ్లెక్సీల నిషేధం-కమిషనర్ హరిత

చదరపు అడుగుకు రూ.100 జరిమానాలు..
నెల్లూరు: పర్యావరణ రక్షణ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీల తయారీ, వినియోగం పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్లు కమిషనర్ శ్రీమతి హరిత వెల్లడించారు. నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ, సైన్ బోర్డ్ తయారీదారులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాలను వారికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవో నెంబరు 65 ద్వారా పర్యావరణం, అడవులు, సైన్స్ & టెక్నాలజీ విభాగం వారు తే22-09-22ది, ఏ.పి గజిట్ నెం1320రు, రాష్ట్ర పర్యావరణ చట్టం 1986 ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ 1 వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేదించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ వ్యక్తీ ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్ తయారీ, దిగుమతి, బ్యానర్ ల ముద్రణ, వినియోగం, రవాణా, ప్రదర్శనలపై పూర్తి నిషేధం అమలులోకి వస్తుందని వివరించారు. కార్పొరేషన్ పరిధిలోని ఆరోగ్య అధికారులు, నగర పాలక సంస్థ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటరీ కార్యదర్శులతో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి, చట్టాన్ని అతిక్రమించిన వారిపై పర్యావరణ రక్షణ చట్టం 1986 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. దానితో పాటు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లు నగరంలో వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ప్రదర్శిస్తే నిర్వాహకులకు చదరపు అడుగుకు వంద రూపాయల వంతున జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసారు. నగరంలో ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, వ్యాపార ప్రచారం నిమిత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల మనుగడకై చేస్తున్న అత్యున్నత కార్యక్రమాన్ని ప్రజలంతా బాధ్యతగా భావించి సహకరించాలని కమిషనర్ కోరారు.