హైదరాబాద్: లైగర్ సినిమాకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు హీరో విజయ్ దేవరకొండను బుధవారం ప్రశ్నించారు. లైగర్ సినిమాకు కొందరు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా లైగర్ సినిమా షూటింగ్ కోసం ఇద్దరి అకౌంట్స్ లో డబ్బు డిపాజిట్ సంబంధించిన వివరాలతో విజయ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో పెట్టుబడిపెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు పెట్టుబడులు పెట్టారు..? లాంటి వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తొంది. విదేశాల్లో జరిగిన షూటింగ్ సెట్టింగ్స్, అక్కడి నటులకు చెల్లించిన రెమ్యునరేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పరిశీలించినట్లు సమాచారం. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న బ్యాంక్ లోన్స్, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, విదేశాలకు డబ్బును ఏ రూపంలో తరలించారనే కోణంలో ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. లైగర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మిని విచారించారు.