రూ.25 కోట్లతో కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాలు-కలెక్టర్

నెల్లూరు: కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. కందుకూరు పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో కలిసి కలెక్టర్, సుమారు రూ.7 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, 80 లక్షల రూపాయలతో కందుకూర్ లో వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, జిల్లా మొత్తం 85 PHCలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే కందుకూరు పట్టణంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి రూ 25 కోట్లు నిధులు మంజూరు చేశారని, ఈ నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే ప్రజలందరూ కూడా కరోనా మూడో డోస్ వ్యాక్సిన్ ను తప్పకుండా వేయించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..
కందుకూరు MLA మహీధర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని చెప్పే వారికి ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే సమాధానం చెబుతాయన్నారు. ఇటీవలే రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టామని చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వెంకటాపురం వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలు తీర్చామన్నారు..ఈ కార్యక్రమాల్లో DM&HO పెంచలయ్య, కందుకూరు RDO వెంకటసుబ్బారెడ్డి, కమిషనర్ మనోహర్ బాబు, తాసిల్దార్ సీతారామయ్య, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.