హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) కన్నుమూశారు..గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు..వార్త తెలియడంతో తెలుగు సినీపరిశ్రలో విషాదం అలముకుంది..కె.విశ్వనాథ్ మృతిపట్ల పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు..
గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివారు..ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు..ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్‌ను ప్రారంభించారు..1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు..సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.‘నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలిచి వేసింది..ఆయన కన్నుమూసిన వార్త విని షాక్ కు గురయ్యాను..ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు..తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు..ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు..