ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో కొత్తగా మంజూరై చేపడుతున్న జాతీయ రహదారులకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రైల్వే, పరిశ్రమల ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో భూసేకరణ, అలీనేషన్ తదితర అంశాలపై సమావేశం నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములను సేకరించడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబందించి ప్రాజెక్టు వారీగా నిర్ధిష్టమైన గడువును నిర్దారించుకొని ఆ గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలన్నారు. వివిధ ప్రాజెక్ట్స్ భూసేకరణకు సంబందించి పెండింగ్లో వున్న అనేగ్జర్-XI లను త్వరగా మంజూరు అయ్యేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. జిల్లాకు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములు సేకరించడంతో పాటు అలీనేషన్, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతోoదని, రెవెన్యూ డివిజనల్ అధికారులు ఇకనైనా ఎటువంటి జాప్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు.నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి, ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో సంబందిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.