AMARAVATHIEDUCATION JOBS

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1వ నుంచి 20వ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. 81 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలకు 52076 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 25202 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 24243, ఒకేషనల్ విద్యార్థులు 2631 మంది ఉన్నారు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే మార్చి 18వ తేదీ నుంచి 30 తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 176 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు  మొత్తం 32834 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష సమయానికి నిర్ణీత సమయాన్ని కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా అవగాహన కల్పించాలన్నారు.పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని,పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడా కూడా జిరాక్స్ కేంద్రాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎటువంటి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో గుర్తింపు పొందిన అధికారులు, సిబ్బంది మాత్రమే ఉండాలన్నారు. ఇతర వ్యక్తులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. RTC అధికారులు విద్యార్థులకు సౌకర్యవంతంగా పరీక్షలకు ఒక గంట ముందుగానే వెళ్ళే విధంగా వివిధ గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *