విద్యార్దులు ఇంటర్న్షిప్ విధానాన్ని అందిపుచ్చుకొవాలి-కలెక్టర్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా సాధారణ డిగ్రీ కోర్సులలో ప్రవేశపెట్టిన ఇంటర్న్షిప్ విధానాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాది వేసుకోవాల్సిందిగా విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. సోమవారం నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో LIC సంస్థలో ఇంటర్నషిప్ చేయబోవు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేనివిధంగా, కేవలం ప్రొఫెషనల్ కోర్సులలో మాత్రమే ఉండే ఇంటర్న్షిప్ విధానాన్ని సాధారణ డిగ్రీ కోర్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పరిశ్రమల భవిష్యత్తు అవసరాలను ముందుగానే గుర్తించి విద్యార్థులకు ఆయా రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు సానుకూల దృక్పథం కలిగి ఉండి, ఇంటర్న్షిప్ ను కేవలం కోర్సులో భాగంగా కాకుండా, జీవితంలో ఉపయోగపడేవిధంగా నేర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో తమదైన మార్కెటింగ్ వ్యూహలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంస్థ భారత జీవిత భీమా సంస్థయని అటువంటి సంస్థ లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించిన భారత జీవిత భీమా సంస్థ వారికి, సహాయ సహకారం అందించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వారికి తమ ప్రత్యేక ధన్యవాదాలన్నారు.