ముందస్తు జాగ్రత్తలతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా నివారించాం-కలెక్టర్

నెల్లూరు: మాండుస్ తుఫాను నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణనష్టం లేకుండా నివారించగలిగామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ నెల్లూరు బ్యారేజి ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీటి ప్రవాహన్ని పరిశీలించారు.తెలుగుగంగ ప్రాజెక్టు C.E హరినారాయణరెడ్డి సోమశిల ప్రాజెక్టు, సంగం బ్యారేజిల ద్వారా విడుదలైన వరద నీటి ప్రవాహన్ని గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాండుస్ తుఫాను ప్రభావంతో జిల్లాలోని 38 మండలాల్లో సగటున 18 సెంమీల వర్షపాతం నమోదయిందని తెలిపారు. అత్యధికంగా మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో 28 సెంమీల వర్షపాతం, అత్యల్పంగా కలిగిరి మండలంలో 7 సెంమీల వర్షపాతం నమోదయిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు వరద నీటి ప్రవాహన్ని అంచనా వేస్తూ, ఇతర శాఖల సమన్వయంతో ధీటుగా ఎదుర్కొన్నామన్నారు. అదేవిధంగా NDFR, 2 బృందాలు,,SDRF నుంచి ఒక బృందం సహాయంతో రిస్క్యు ఆపరేషన్స్ నిర్వహించామన్నారు. దాదాపు 2800 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించి అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. వర్ష ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని, రాబోయే రెండు రోజులు మత్స్యకారులు సముద్రం లోకి వెళ్ళవద్దని సూచిస్తూ, 12 తేదీ అర్ధరాత్రి వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.సోమశిల ప్రాజెక్టు నుండి 38 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేయడం జరిగిందని, వరద ఉదృతిని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో మంచి వర్షపాతం నమోదయి, జిల్లాలోని 780 చెరువులు నిండాయని, రాబోయే వ్యవసాయ సీజన్ కు పుష్కలంగా నీరు లభించిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నెల్లూరు DRO మలాల్, ఇరిగేషన్ SE కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు.