x
Close
DISTRICTS

అన్ని డివిజనుల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు-మేయర్ స్రవంతి

అన్ని డివిజనుల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు-మేయర్ స్రవంతి
  • PublishedJuly 29, 2022

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని రూరల్, నగర నియోజకవర్గంలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్నామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 51 తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులంతా వాటిని ఆమోదించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పన్నులు, యూజర్ చార్జీలు, మంచినీటి కుళాయిలు పన్నులకు సంభందించిన అంశాలపై ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సభ్యుల సమక్షంలో తీర్మానించారు. వివిధ డివిజనుల ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ వీధి కుక్కలు, కోతులు, దోమల సమస్యలను ప్రస్తావించారు. డివిజనుల్లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణను ముందస్తుగా స్థానిక కార్పొరేటర్ కు సమాచారం అందిస్తే పర్యవేక్షిస్తారని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు నూతనంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ముందుగా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తే, ప్రభుత్వానికి లబ్ధిదారులకు మధ్య సంక్షేమ వారధులుగా కార్పొరేటర్లు గుర్తింపు పొందుతారని సూచించారు. రూరల్, నగర నియోజకవర్గాల మధ్య ఏలాంటి తారతమ్యం లేకుండా కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం ప్రాథమిక కర్తవ్యం అని మేయర్ స్పష్టం చేసారు. వర్షాకాలపు సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్ని డివిజనుల్లో డ్రైను కాలువల పూడికతీత పనులు, దోమల నిర్మూలనకు కాలువల్లో ఆయిల్ బాల్స్ పిచికారీ చేయడం, అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టడంతో పాటు ప్రజల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన పెంచాలని మేయర్ అధికారులకు సూచించారు. చెత్త సేకరణ వాహనాలకు విడివిడిగా తడి, పొడి చెత్తను అందజేస్తేనే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేయగలమని మేయర్ వివరించారు. ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన వివిధ స్థానిక సమస్యలను, అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కౌన్సిల్ సభ్యులకు సహకరించాలని మేయర్ ఆకాంక్షించారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.