పోర్టు నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించండి-కలెక్టర్

నెల్లూరు: రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోబిక, రామాయపట్నం పోర్టు ఎం.డి ప్రతాప్ రెడ్డిలతో కలసి రామాయపట్నం పోర్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాలైన మొండివారిపాలెం, రావులవారిపాలెం గ్రామాలకు సంబంధించి నిర్మిస్తున్న ఆర్. అండ్ ఆర్ కాలనీని సందర్శించి, ఆర్ అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న పునరావాస పనులను పరిశీలించారు. చేపడుతున్న పునరావాస పనుల వివరాలు, ప్యాకేజీ పురోగతి, భూ సేకరణ ప్రక్రియ పురోగతి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీటి వసతి, విద్య, వైద్యం తదితర వసతులతో ఆర్. అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న పునరావాస పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.అనంతరం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి, పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోర్టు అధికారులకు సూచించారు.