నెల్లూరు: మంచి ఆరోగ్యంతో మాత్రమే మంచి భవిష్యత్ వుంటుందని, ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో మార్పు రావాలని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి సూచించారు. మంగళవారం నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్రస్థాయి క్రీడా సంబరాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలను జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్,జిల్లాస్థాయి అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు కేవలం ర్యాంకులు చూసి కార్పొరేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారని, బాగా చదివి గొప్ప ఉద్యోగం పొంది డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నారే కానీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రయత్నించడం లేదన్నారు. విద్యతో పాటు క్రీడల వైపు కూడా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో మార్పు రావాలని, ప్రతిఒక్క విద్యార్థి క్రీడలపట్ల ఆసక్తి చూపేలా వారిని ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రస్థాయి సీఎం కప్-2022 పోటీల్లో సత్తా చాటి జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని మంత్రి పిలుపునిచ్చారు.క్రికెట్, వాలీబాల్, కబడ్డీ జిల్లాస్థాయి పోటీలను మంత్రి ప్రారంభించారు.