పరిశ్రమలు నెలకొల్పే వారికి సకాలంలో అనుమతులు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తున్న ఔత్సాహికులకు అన్నివిధాల ప్రోత్సాహాకాలు అందించాలని, సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ పరిశ్రమల స్థితిగతులు- అనుమతులు-ప్రోత్సాహకాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల నిర్వాహకులకు క్షేత్రస్థాయిలో భూముల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన, రుణాల మంజూరుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి అందే రాయితీలను కూడా వారికి సకాలంలో అందించాలన్నారు. జిల్లాలో ఎక్కువమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా అవకాశం ఉన్న పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని సూచించారు.