నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు-కలెక్టర్

నెల్లూరు: ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు.శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో న్యాయపరమైన కేసుల పరిష్కారం పై రెవెన్యూ అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానం కేసులకు సంబంధించి ప్రతిరోజు లాగిన్ లో పరిశీలించి ఏరోజుకారోజు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు న్యాయపరమైన కేసులు పర్యవేక్షించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయిలో భూ పరిపాలన ముఖ్య కమిషనర్ ప్రతివారం సమీక్షిస్తున్నారన్నారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న పాత కేసులను కూడా స్కానింగ్ చేయడం జరుగుతుందని,వాటిని రెండవ దశలో చేపట్టాల్సి ఉంటుందన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సరిగా సమాధానం తెలియజేయక ఉన్నతాధికారులకు ధిక్కరణ నోటీసులు వచ్చే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. కోర్టు ఉత్తర్వులను మొదటి నుండి చివరి వరకు క్షుణ్ణంగా పూర్తిగా చదివి అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులను తప్పనిసరిగా శిరసావహించాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ విషయాలు గమనించి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఎటువంటి పరిస్థితుల్లో ధిక్కరించడం చేయరాదన్నారు. అవసరమైతే వాస్తవ విషయాలను తెలియజేస్తూ అప్పీల్ కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇకనైనా తప్పులు జరగకుండా పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే న్యాయ సలహాదారుని కాని ప్రభుత్వ న్యాయవాదిని కాని సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కోర్టును తప్పుదారి పట్టించిన, తప్పుడు సమాచారం అందజేసిన నేరమే అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇకనైనా రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలని ప్రక్షాళన జరగాలని జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా ప్రవర్తించాలన్నారు. ఏమీ కాదని ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 6 నెలల జైలు శిక్ష, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టంపై అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టుకు సక్రమంగా నివేదిక అందజేస్తే సరైన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. భూ సంబంధ అంశాలలో సరైన నిర్ణయం తీసుకోవాలని పెండింగ్లో ఉంచినా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు ఇకపై పొరపాట్లు పునరావృతమైతే ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరావు న్యాయపరమైన అంశాలపై పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, కావలి,కందుకూరు ఆత్మకూరు ఆర్డీవోల సీనానాయక్,సుబ్బారెడ్డి, శ్రీమతి కరుణ కుమారి,న్యాయ సలహాదారు రాజేశ్వర్ రెడ్డి పలువురు తహసీల్దారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.