పేదలకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం- ఎమ్మేల్యే అనిల్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా “పట్టణ ఆరోగ్య కేంద్రాల” నిర్మాణం జరుగుతోందని సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ వెల్లడించారు. స్థానిక 44వ డివిజన్ కలెక్టరేట్ సమీపంలో నూతనంగా నగర పాలక సంస్థ నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కొన్ని వ్యాధులను సైతం పధకంలో చేర్చి పేదలందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేసి ప్రజలపై ఆర్ధిక భారం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వయో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కను నాటి సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ హరిత, DM&HO డాక్టర్ పెంచలయ్య, MHO డాక్టర్ వెంకటరమణ,Dy మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు నీలి రాఘవ రావు, పోట్లూరి రామకృష్ణ, ముదిరెడ్డి వేదవతమ్మ, షేక్ సఫియా బేగం, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ చంద్రయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.