AMARAVATHIDEVOTIONAL

తిరుమలలో భక్తులజన సముద్రం-ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించిన క్యూ లైన్లు

సర్వదర్శనం భక్తులకు 48 గంటలు
తిరుమల: పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి.అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్ లలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచి క్యూ లైన్లలో వున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు.నేటి (30వ తేదీ నాటి)కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ రేడియో,,బ్రాడ్ కాస్టింగ్ విభాగం ఈ విషయమై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో నిరంతరం ప్రకటనలు చేస్తోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోంది.ఈ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *