చుక్కల భూముల సమస్యలపై ఈనెల 20న తహసిల్దార్ కార్యాలయాలలో సదస్సులు-కూర్మనాథ్

నెల్లూరు: చుక్కల భూముల సమస్యలపై ఈనెల 20వ తేదీ శనివారం నాడు నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన నెల్లూరు రెవెన్యూ డివిజన్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వ తేదీ శనివారం నాడు జరిగే చుక్కల భూముల సమస్యలపై రెవిన్యూ సదస్సు గురించి ప్రజలందరికీ తెలిసేలా గ్రామాలలో టామ్ టామ్ వేయాలన్నారు. ఈ సదస్సు నెల్లూరు డివిజన్లోని ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఉదయం 10:30గంటలకు జరుగుతుందన్నారు.ఈ సదస్సులో చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. చుక్కల భూములకు సంబంధించి నిబంధనల మేరకు అనుగుణంగా ఉన్నటువంటి దరఖాస్తులను స్వీకరించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.