AMARAVATHIDEVOTIONAL

ఈ సమస్త సృష్టిలో శివుడు కానిదేదీ లేదు,శివుడంటే… నువ్వూ నేనే కదా!

కృష్ణపక్ష చతుర్దశిని “మహాశివరాత్రి”
అమరావతి: సంవత్సరంలో పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని “మహాశివరాత్రి”గా వ్యవహరిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. 1-అప్పటివరకు ఒక రూపమే లేని మహాదేవుడు లింగరూపం ధరించి బ్రహ్మవిష్ణువుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజే మహాశివరాత్రి… 2-లింగరూపంలో నిర్గుణపరబ్రహ్మగా ఉన్న పరబ్రహ్మ పార్వతీదేవిని కల్యాణం చేసుకుని సగుణంగా దర్శనమిచ్చింది మహాశివరాత్రి రోజునే….3-దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధిస్తుంటే తొలుత హాలాహలం పుట్టింది. దానిని శివుడు తన అంగిట్లో నిలుపుకుని, లోకాలకు మేలుచేసింది మహాశివరాత్రి నాడు. అందుకే, ఈ రోజున ఆయనను పూజించడం ఆచారం.
నమశ్శివాయ మంత్రం:- ఆకాశమే లింగమై, భూమి దానికి వేదికై (పానవట్టమై) నిలిచింది. ఆ వేదిక శక్తి స్వరూపం. వేదికమీద ఉన్న పిండమే శివుడు. ఈ సకల ప్రపంచం మహాప్రళయంలో శివలింగమందే లయమై, తిరిగి అక్కడినుంచే మళ్లీ ఆవిర్భవిస్తున్నది. అక్కడే దేవతలందరూ కొలువుదీరి ఉంటారు. అందుకే శివుడిని మాత్రమే కాకుండా వినాయకుడిని, గౌరిని, విష్ణువును, నరసింహుడిని… ఇలా ఏ దేవతనైనా లింగరూపంలో ఆరాధించవచ్చు. లింగమనే శబ్దానికి చిహ్నమని అర్థం. లింగంలో ఆకారం కానీ, రూపం కానీ ఉండదు. కానీ శివుడు కేవలం లింగరూపి కాడు. ఆయనకు సకల, నిష్కళ, సకలనిష్కళ అనే మూడు రూపాలున్నాయి. ఈశాన మంత్రం ఆయనకు కిరీటం. తత్పురుష మంత్రం ముఖం. అఘోర మంత్రం హృదయం. వామదేవ మంత్రం గుహ్యభాగం. సద్యోజాత మంత్రం పాదాలు. ఆయన మంత్రమయుడు. ఆయన నిరాకార రూపం లింగంగా, సాకారరూపం పరమేశ్వరునిగా పురాణాలు చెప్పాయి. మన ఎదురుగా ఉన్న లింగానికి ఏ అవయవాలూ లేకపోయినా… అయిదు ముఖాలు, పది చేతులు, శుద్ధస్ఫటిక వర్ణంతో ప్రకాశిస్తూ సర్వాభరణాలు, చిత్రవస్ర్తాలు ధరించినవానిగా పరమేశ్వరుణ్ని ధ్యానం చేయాలి. ఇందులో ఓంకారాన్ని ముఖంగా, వా, య అనే అక్షరాల్ని రెండు చేతులుగా, శి అనే అక్షరాన్ని నడుముగా, నమః అనే అక్షరాల్ని పాదాలుగా భావించి పంచాక్షరిని జపించాలంటుంది లింగపురాణం.
ఈ సమస్త సృష్టిలో శివుడు కానిదేదీ లేదు:- ఆయన శాశ్వతుడు. సనాతనుడు – నవయువకుడు కూడా ఆయనే. ఆయన పురుషుడే కాదు… స్త్రీ కూడా. సృష్టిలోని ప్రతి ద్వంద్వాన్ని ఆక్రమించుకుని ఆయన ద్వంద్వాతీతుడు అయ్యాడు. అనులోమ, విలోమ స్థాయీభేదాలను మాత్రమే కాదు… సానుకూల, వ్యతిరేకాలలో సైతం ఆయనే ఉన్నాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎందుకంటే ఆయనే పాలకుడు కనుక. జన్మనిచ్చేది ఆయనే.. జన్మించేది ఆయనే. మృత్యువూ ఆయనే. మృత్యుంజయుడూ ఆయనే. కాలాత్మకుడు, కాలాంతకుడూ కూడా ఆయనే. జీవేశ్వరుడు, మహేశ్వరుడు ఒకడే. శివుడు మానవుణ్ని పంచభూతాలతోనే నిర్మించాడు. సూర్యుడనే చైతన్యం, చంద్రుడనే ఆనందం ఇచ్చాడు. జీవునిగా మనిషి లోపల వెలుగొందుతున్నాడు.
శివుడంటే… నువ్వూ నేనే కదా!:- లింగమనే శబ్దానికి చిహ్నమని అర్థం. లింగంలో ఆకారం కానీ, రూపం కానీ ఉండదు. కానీ శివుడు కేవలం లింగరూపి కాడు. ఆయనకు సకల, నిష్కళ, సకలనిష్కళ అనే మూడు రూపాలున్నాయి. ఈశాన మంత్రం ఆయనకు కిరీటం. తత్పురుష మంత్రం ముఖం. అఘోర మంత్రం హృదయం. వామదేవ మంత్రం గుహ్యభాగం. సద్యోజాత మంత్రం పాదాలు. శివుడు మంత్రమయుడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *